Saturday 14 June 2014

నా హీరో మా నాన్న

మా నాన్న అంటే నాకు కోపం... మమ్మల్ని అర్ధాంతరంగా వదిలి వెళ్ళిపోయినందుకు...

        శ్రీ కృష్ణుడి వేషం లో నాన్న   
Rayabaram Natakam lo Krishnudu
        ఫ్రెండ్స్ అందరూ ఫోన్ లో హాయ్ డాడీ .. హలో డాడీ అంటుంటే ... నాకు ఆ అదృష్టం లేనందుకు ఎన్నోసార్లు ఏడ్చాను...నాన్నగురించి ఎలా రాయాలో ఏం రాయాలో నాకు తెలియటం లేదు అయన గురించి ఎంత రాసిన 
అది తక్కువే...అయన పేరు సత్యనారాయణ, వి.అర్.ఓ గా పనిచేసేవారు.. అయన టాలెంటే వేరు.. హార్మోనియం,
తబలా వాయిస్తారు...  డ్రామా ఆర్టిస్టు మరియు కవి, పాటలు, పద్యాలు అద్భుతంగా రాయగలడు పాడగలడు, (అయన రాముడి భక్తుడు అందుకే ఎక్కువగా రాముడి పాటలు రాసేవాడు)...మోహన, కళ్యాణి, తోడి, రాగాలు అంటే ఆయనకి చాలా ఇష్టం.. హరిదాసు కూడాను.... ఆయుర్వేద వైద్యం కూడా చేస్తాడు.. వీటితో పాటు కోపం కూడా కొంచెం ఎక్కువే.. కోపం ఉన్నా కూడా మా ఊరిలోనే కాకుండా చుట్టుపక్కల ఊర్లలో కూడా మంచి పేరునే తెచ్చుకున్నారు..ఒకప్పుడు ఒక పొలిటికల్ పార్టీ యూత్ లీడర్ గా ఉన్నాడు, మా ఊరిలో సర్పంచ్ గా పోటి చేసి ఓడిపోయిన మా నాన్న, అదే ప్రత్యర్థి మీద అమ్మని పోటి పెట్టి గెలిచాడు.. ఆ రోజు అయనలో చుసిన విజయ గర్వం నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఎన్నో కష్ట నష్టాలని ఎదుర్కొని నిలబడిన మా నాన్నే నా రోల్ మోడల్. నాన్నే నా హీరో

       మాది ఉమ్మడి కుటుంబం.. నాన్న వాళ్ళు ఐదుమంది అన్నదమ్ములు.. నాన్న రెండవవాడు.. పెదనాన్న, పెద్దమ్మ, బాబాయిలు, పిన్నమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు.. అన్న, తమ్ముళ్ళు... అందరం ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం.. అయన అంటే ఇంట్లో అందరికి భయం, భక్తి, గౌరవం... ప్రతి పండగకి ఎవరు ఎక్కడున్నా అందరు ఇంటికి చేరాల్సిందే అది అయన ఆర్డర్. ఇంట్లో అయన మాటకి ఎదురులేదు. 

         రాముడంటే ఆయనకి చాలా ఇష్టం.. ప్రతి శనివారం మా ఊరి రామాలయంలో భజన చేసేవాడు మమ్మల్ని అందరిని తీసుకెళ్ళేవాడు.. అలాంటి మా నాన్నని తీసుకెళ్ళిపోయినందుకు రాముడి మీద నాకు చాలా కోపం ఉండేది... కాని అది కొద్దిరోజులే.. మా నాన్న చివరి రోజుల్లో నాతో అన్నమాట.. నువ్వు పూజించకపోయినా పర్లేదు తిట్టకూడదు అని.. నా కోపం నాన్నని మా నుంచి దూరం చేసాడనే.. కాని నాన్నకు ఇష్టమైన దేవుడిపైన నాకు కోపం ఉండటం తప్పు అనిపించింది.. అందుకే.. ఇప్పుడు నాకు కూడా ఇష్టమైన దేవుడు రాముడే..

        మా కోసం కష్టపడ్డ మా నాన్నని తలచుకుంటే గుండె బరువెక్కుతుంది ...  మా నాన్న మా కోసం అయన ప్రాణాలను ఫణంగా పెట్టాడు... నిద్రాహారాలు మాని ఒంట్లో పెరుగుతున్న జబ్బును లెక్క చేయకుండా ప్రాణం మీదకు తెచ్చుకొని మమ్మల్ని అర్ధాంతరంగా వదిలి తిరిగిరాని లోకాలకు చేరాడు... కాన్సర్ మహమ్మారి మా నాన్నని బలితీసుకుంది. ఆయనతో పాటు మా ఆనందం సంతోషం కూడా వెళ్ళిపోయాయి .. ఏం సాధించినా...అయన లేని లోటు అలాగే ఉంది.. జాబ్ లో జాయిన్ అయ్యాక నాన్న కు అది కొనివ్వాలి అలా చూసుకోవాలి ఇలా చూసుకోవాలి అని ఎన్నో ఆశలు.. అవి నెరవేరకుండానే మా నాన్న మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు. నాన్నకి నేనంటే ఒక ప్రత్యేకమైన అభిమానం... చదువు బానే చదువుతానని అయన నమ్మకం (కేవలం అయన నమ్మకం.. అంతే)
'పండిత పుత్ర పరమ శుంట ' అనేది మనకి పర్ఫెక్ట్ గా సరిపోతుంది ...ఆయనకు వచ్చిన దాంట్లో మనకి ఒక్కటి కూడా వంటబట్టలేదు.. కాని అన్నయ్యకి ఆ హార్మోనియం నేర్పించాడు.. నాకు హరికధ నేర్పించాలని చాలా ప్రయత్నించారు.. అప్పట్లో అది నాకు నామూషీ... ఇప్పుడేమో నేర్చుకొని ఉంటె బాగుండేది అని ఆశ.. "అందుబాటులో ఉన్నంత వరకు దాని విలువ తెలియదు" నిజమే...ఇప్పుడు అర్థమయ్యింది నాకు... ఏదో ఆయన బలవంతం మీద ఒకటి రెండు నాటకాలు ఆయనతో కలిసి వేశా .. ఇప్పుడు ఆ వీడియోలు చూసుకుంటూ బ్రతికేస్తున్నా 


నాన్న నేను కలిసి చేసిన డ్రామా శ్రీకృష్ణ రాయబారం నుంచి కొన్ని పద్యాలు 

      మా నాన్న మా నుంచి దూరం అయ్యి ఇప్పటికి 8 సంవత్సరాలు అయ్యింది.. నాన్న లేని ఇన్ని రోజులు ఎలా ఉన్నామో తెలియదు.. బ్రతికే ఉన్నాం అంతే అది కూడా అమ్మ కోసం ఉన్నాం.. ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఉండాలో!.... అయన లేను లోటు ప్రతి చోట మాకు కనిపిస్తూనే ఉంది.. అయన ఉన్నప్పటికీ లేనప్పటికీ చాలా స్పష్టమైన తేడా.. బాధ లోనూ సంతోషం లోను కష్ట సుఖాల్లోను అన్నిటి లోను అయన లేని వెలితి ... నాన్న ఉంటే ఇలా చేసేవారు అలా చేసే వారు అని అనుకోని రోజే  లేదు. అక్క, నేను ఎన్నోసార్లు అనుకున్నాం నాన్న ఉండి ఉంటె ఇలా జరిగేదా అని... మా నాన్న నాకు గుర్తు వచినప్పుడు అయన నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది ఎప్పుడూ అయన చిరునవ్వుతోనే కనిపిస్తాడు.. అయన గుర్తువచ్చినప్పుడల్లా నాకు తెలియకుండానే కళ్ళ వెంట నీళ్ళు వస్తాయి.. 
ఊర్లో ఉన్నపుడు నాన్న కోసం ప్రతిరోజు రాత్రి ఆఖరి బస్సు కోసం చూసే వాళ్ళం. అంత అలసిపోయి వచ్చినా కూడా భోంచేసాక తాంబూలం (తాంబూలం ఆయన అలవాటు) వేసుకుంటూ మాతో మాట్లాడేవాడు. వరలక్ష్మి వ్రతం అందరూ పండగ చేసుకుంటారు కానీ మా ఇంట్లో మా నాన్న ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాం ఎందుకంటే నాన్న మమ్మల్ని భౌతికంగా వదిలి వెళ్ళిన రోజు అది.

         ఇక్కడ అమ్మ గురించి కూడా చెప్పాలి.. అమ్మ పేరు సీతాలక్ష్మి...ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె నిజంగా సీతమ్మవారే .... నాన్నకి అమ్మ దొరకటం అయన అదృష్టం.... మాకు అమ్మ అవ్వడం మా అదృష్టం..

నాన్న పోయిన పదకొండవ రోజు ఒక పెద్దాయన చెప్పిన మాటలు : నాన్న పోతే జీవితం చీకటి అయిపోతుంది అని అది నిజమే.. నాన్న పోయాక జీవితం చీకటి అయిపొయింది.. ఇంకా అదే చీకట్లో ఉన్నా..


"నాకు మరో జన్మ ఉంటే నువ్వే నాకు నాన్న గా కావాలి నాన్నా..."
నాన్న పాత ఫోటో 

నాకు ఇలాంటివి రాయడం రాదు కాని రాయాలని ఆశ.. అది కూడా మా నాన్న గురించి రాయాలని..ఏదైనా తప్పు రాసుంటే నన్ను క్షమించు నాన్న...